15, ఆగస్టు 2012, బుధవారం

ఆనందపు సంబరాల రెపరెపలతో
అంబరాన ఎగరేసిన మువ్వన్నెల పతాకం
నా దేశం ఇది ముజ్జగాల తోరణం ముచ్చటైన ఆభరణం
మూడు కళల ప్రతిరూపం ముప్పేటల మణి హారం

అనురాగ పుటాలయం
అదిగో సతత హరిత సముదాయం
అది నా దేశం
పవిత్ర బాసల ప్రతిరూపం
అదిగో శ్వేత వర్ణ సరాగం
అది నా దేశం
త్యాగశీల కధల పుటల సమ్మిశ్రం
అదిగో కాషాయపు అధికరణం
 అది నా దేశం

వందే మాతర గీతం పాడుతున్న ప్రజల గళం
అది నా దేశం
ఇందువదన భరత మాత కనువెలుగుల కమనీయం
అదినా దేశం
దీక్షానిరతికి ప్రతిరూపం ఈ స్వేచ్చా శ్వేతకపోతం
అదినా దేశం
అణువణువున పొంగారే సజల నయన నయగారం
అది నా దేశం

ఆ పక్కన సూర్యుడూ ఈ పక్కన చంద్రుడూ
నింగికొప్పు చీకటిలో మిలమిలల తారలూ
నిలిచుండే క్షణం వరకు
ప్రతిగుండే ప్రతిగొంతూ ప్రతి మనసూ ఒక్కటిగా
దిశదిశలా వెల్లువయే చరణంలా పలికే
అధినాయక దేశం
అది నా దేశం

4, ఆగస్టు 2012, శనివారం

నిమ్నగలా...

నిమ్నగలా నెమ్మదిగా ప్రవహించే ఈ మౌనం
ఎన్ని కలల కావ్యాలను ఆలపించు మాధుర్యం
నిదురించే కొలను అలల పులకరింత ఈ గమనం
ఎదురుచూచి అలసిసొలసి వేసారిన పూల వనం //

అదిగో ఆ సంధ్య కొమ్మ చివరంచున కోయిలమ్మ
స్వర సంగమ రాగ ఝరిన పలకరించు ఏరువాక
ఇదిగిదిగో ఈ ఉదయపు మయూఖాల తొలి తపన
 ఎదగదిలో ఒదిగిన చిగురాకుల సంబరాలు//

పవళించిన హిమ శైలబాల పెదవులపై జాలువారి
మాట్లాడని మంచుపూల స్వగతాలను  అలికి పలికి
సుతిమెత్తని పాదాల కదిలి నర్తించే గాలి కొసల 
మూగవైన కను చూపుల వినిపించే మువ్వల సడి //

26, ఏప్రిల్ 2012, గురువారం


గురు పూజోత్సవ మీనాడు
మన గురు పూజోత్సవ మీనాడు

పిల్లలు పాపలు లేవండీ పరుగు పరుగునా రారండీ
పట్టెడు మల్లెలు గుప్పెడు జాజులు పాద పూజకై తే తెండి
గురు బ్రహ్మః గురు విష్ణుః  తస్మై శ్రీ గురవే నమహ
పలకా బలపం చేతికి ఇచ్చి పటిక బెల్లపు పలుకులు నేర్పి
ఆకాశానికి నిచ్చెనలేసే ఊహా శక్తికి రెక్కలు తొడిగిన
గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమహ
తెలుగైనా తెలియని భాషేదైనా తెలివైనా తెలియని మైమరపైనా
తేటతెల్లముగ తెలియజెప్పుచు వీపుతట్టి ముందుకు పదపదపదమంటూ
దారిచూపే మర్గదర్శికి ఎల్లలెరుగని ప్రేమ మూర్తికి
మనసా స్మరామి మనసా నమామి మనసా వాచా ప్రణమామ్యహా
 తుది గమ్యం  ఏదైనా చిరుమలుపులు ఎన్నున్నా
మానవతకు పెద్దపీట మనుగడకే తొలిపునాది
తొలిపలుకును దిద్దించే చేతినెపుడు మరవమనే
మనస్సాక్షి సాక్షంగా వెలుగులయే గురుదేవులకే శిరసువంచి పలికే
మనసా స్మరామి మనసా నమామి మనసా వాచా ప్రణమామ్యహా


ఆ నీలి కళ్ళ సంద్రంలో ఎక్కడివా నీలాలు
పొడి బారిన నదులా అవి ప్రేమ కధా కావ్యాలు
ఎడారిలో ఎండమావి మెరుపు ల్లా
ఎప్పటివా వట్టిపోయి వగచే పంటపొలాలు

కన్నీరై ప్రవహించే కరుణామృత హృదయం
సవరించిన సరిగమలై మది పలికే చిరు గీతం
మరపురాని గతం మళ్ళీ వసంతమై తిరిగొస్తుందని
ఎన్నాళ్ళీ ఎదురు చూపు ఎద వాకిట తలపు వెనక

మబ్బు నలుపు నీడలోనొ మసక వెలుగు తుది మలుపునొ
మోమంతా పరచుకున్న మధురమైన దరహాసపు వెన్నెలలా
ఆ ఘడియలు ఏక్షణమో ఎదుట నిలిచి పిలిచేనని వలచేనని
రెప్ప వాల్చలేని బ్రతుకు ఎదురు చూపు తూపులలో తూగుటలో

అరఘడియో రెప్పపాటు పొరబాటో తూలి సోలి వేసారిన
విరహపు తుది క్షణమో అలవోక నీడగా తొలి చినుకు పాటలా
అలికిడే తోచనీ మునిమాపు ముసురులా కరగిపోయావా
కదలిపోయావా కన్నీటి చెక్కిళ్ళు గాలిలా తాకుతూ .

నిన్న కలను కన్నానూ నీటి చెలమ నీ మనసున
తేట తేనె ఊటలలో పరుగులిడే పాట ననీ 
ఏటవాలు వెన్నెలనై జాలువారి జాలువారి
నీ చెక్కిలి వాకిట నే పూసిన ఓ పున్నమినని
నిన్న ............

సుతి మెత్తని మరకతాల పానుపుపై
చినుకు చినుకుగా ఒక్కటొకటిగా
కురిసిన పున్నాగల తొలకరింపు జల్లులలో
నీ అందెల చిరు సవ్వడి సరిగమ నేననీ
నిన్న ...........

నులి వెచ్చని అలల పొంగు నురగలలో
నీ చిరునవ్వుల పారిజాత సుమ దళాలు
నింగి కొసల ముడి వేసిన రంగుల హరివిల్లు
నోట నును సిగ్గుల కలబోతల కల్కూజితాలు
నిన్న ............

పెదవికొసల వంపులో చిరు వలపుల చందనాలు
మేని హొయల సొంపులలో ఎన్నో మరి విన్నపాలు
నిన్న మొన్న కనువిప్పిన చిన్ని పాప చిరునవ్వులు
అన్నీ అన్నీ నా మనసున తలలెత్తిన మొలకలనీ

నిన్న ..........






ఓ గాలి తెర కదిలినా
ఓ గాలి తెర కదిలి ఎద వీణమీటెనేమో
అలవోక గిలిగింతకే గమకాలు కురుస్తోంది
మనసు పులకింతలే మాటమౌక్తికాలవుతూ
పాట పూదోట పరవశాలను జల్లుతోంది "ఓ గాలితెర"

పలుకు తేనియలన్ని తొణికిపోయేనేమొ
సెలయేటి తుళ్లింత కళ్ళు విప్పిందేమో
గలగలా పారేటి ఏటి సొబగులు కూర్చి
పాట జలపాతమై పరుగు తీసింది "ఓ గాలితెర"

మైమరచి మనసేమొ వలసబోయిన  వేళ
తలిరాకు టూయలల పవ్వళించిన కలలు
మబ్బు తొలిపిలుపుకే ఉలికి పాటున జూసి
పాట పన్నీరులనూ జలాజలా కురిసేను
ఓ గాలి తెర కదిలి ఎద వీణమీటెనేమో
అలవోక గిలిగింతకే గమకాలు కురుస్తోంది
తొణికే స్వప్నమా తొలకరి ముత్యమా

తొణికే స్వప్నమా తొలకరి ముత్యమా
ఎద లోలోపలి ఏకాంత మౌనమా
ఎందుకే నీకింత తుళ్ళింతలీ వేళా
ఎందుకే నీకింత రాగతనమీ వేళా

చెక్కిళ్ళకెంజాయ కెరటాలు పల్లవించినవేమొ
మెలమెల్లగా దిగులు తెల్లవారినదేమొ
నీలిగగనపు సీమ నెమలి నడకల తోడ
శృతిచేసి ఎదమీటి ఎందుకీ వేదింపు
కనుదోయి కలశాల లేత మామిడి కొమ్మ
వలపు రెమ్మ
పరచిన పాల చెక్కిళ్ళ పుంతలో
 సిగ్గు సింధూరాల వీణ
భావాల జాతర వాకిళ్లలోనీ తలపుకళ్ళ లో
తేనె తొలి చినుకు వాన
 ఎవరితో చెప్పనీ నును వెచ్చనీ మలుపు
ఎవరికై చిలకనీ మనసు గంధపు చినుకు
ఏనాటి భాగ్యమో ఎదురైన ఈ ఘడియ
ఎంత మాధుర్యమో చూపు రెక్కల మాటు
వేన వేల అనునయాల అలికిడుల రాగాలు